హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కొందరు నేతల ట్రాప్‌లో ఉన్నారని, ఆయనను కూడా పని చేయనివ్వరని చెప్పారు. మంగళవారం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీలో సమస్యలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. కానీ తన రాజీనామాను ఆమోదించేలా నలుగురు నాయకులు కుట్ర చేశారని ఆరోపించారు. బీజేపీ తనకు సొంత ఇల్లు లాంటిదని, పార్టీలోకి పిలిస్తే మళ్లీ వెళ్తానని స్పష్టంచేశారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని.. ఎమ్మెల్యే పదవికి కాదని చెప్పారు.