వనపర్తి : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల( Congress Leaders) మధ్య ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి ( Chinnareddy ) పై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ( MLA Meghareddy ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డి వెన్నుపోటు రాజకీయాల వల్లే జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని శుక్రవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
చిన్నారెడ్డితో పాటు మరికొందరి నాయకులపై ఏఐసీసీ, పీసీసీ , క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 51 గ్రామపంచాయతీ స్థానాలలో 15 నుంచి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వల్లే గెలుచుకుందని పేర్కొన్నారు. ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని వివరించారు.
ఎమ్మెల్యే గా తనపై , నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలని పరోక్షంగా చిన్నారెడ్డిని ఉదాహరిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.