యాదగిరిగుట్ట, జనవరి 29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది. ప్రచారశాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయ మై ఏడాది కావొస్తున్నా పట్టించుకోకపోవడం.. తాజాగా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురావడంతో ఆలయ అధికారులపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారశాఖ విభాగం లో పనిచేసే ఓ అధికారి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన కుమారుడు కౌశిక్‌ను నియమించారని తెలుస్తున్నది. విషయం బయటకు పొక్కడంతో ప్రచారశాఖకు చెందిన అధికారులు హుటాహుటిన దేవస్థాన నగదు కౌంటర్లో బుధవారం రూ.6.20 లక్షల జమ చేసినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్, ఆలయ అధికారులు ఆరా తీశారు.
ప్రచారశాఖలో జరుగుతున్న అవినీతిపై ‘నమస్తే తెలంగాణ’ప్రచురించిన కథనానికి దేవాదాయ శాఖ ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. డాలర్లు భక్తులకు విక్రయిస్తే ఇందుకు సంబంధించిన నగదు దేవస్థాన ఖాతాలో ఎందుకు జమచేయలేదన్న ఆంశాలపై వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం, వెండి డాలర్లు కనిపించడంలేదని తెలిసింది. గురువారం బాధ్యతలు స్వీకరించిన ఈవో భవానీశంకర్ మాట్లాడుతూ.. డాలర్ల మాయం తన దృష్టికి వచ్చిందని, సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు.