హైదరాబాద్, జూలై31 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారించాలని, దానిపై తుది నిర్ణయం తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంపై తెలంగాణ బీసీ, ఓసీ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో-చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని విద్యుత్తు సంస్థల యాజమాన్యాలను కోరారు.
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో 2009 నుంచి నేరుగా నియమితులవుతున్న ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారించాలన్న కమిటీ నివేదిక మేరకు 2021లో సంబంధిత సంస్థలు ఉత్తర్వులను జారీ చేశాయని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్తు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున ప్రధాన కార్యదర్శి సీ భానుప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారని, 1986 నుంచి నేరుగా నియమితులైన ఉద్యోగులందరి సీనియార్టీని మెరిట్ ఆధారంగానే నిర్ధారించాలని, నష్టపోయిన వారందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారని వివరించారు.
మెరిట్ ప్రాతిపదికన సీనియార్టీని నిర్ధారించాలని ఏపీఎస్ఈబీ సర్వీస్ రెగ్యులేషన్స్‌లో చాలా స్పష్టంగా ఉన్నదని ఆయన వాదన వినిపిస్తూ.. బీమ్లేశ్ తన్వర్ కేసులో సుప్రీంకోర్టు 2003లో ఇచ్చిన తీర్పును ఉదహరించారని తెలిపారు. మరోవైపు విద్యుత్తు సంస్థలు కూడా మెరిట్ ఆధారంగానే సీనియారిటీలను నిర్ధారించాలని ఆదేశించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాదిపదికగానే ఉద్యోగుల సీనియార్టీని నిర్ధారించి, పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
1986 నుంచి సీనియార్టీలను సమీక్షించినట్లయితే న్యాయపరంగా చికులు వస్తాయని,ఇప్పటికే కొందరు ఉద్యో గ విరమణ పొందినందున 1986 నుంచి సీనియార్టీలను సమీక్షించడం వీలుకాదని న్యాయస్థానానికి వివరించినట్టు వెల్లడించా రు. దీంతో పిటిషనర్ దరఖాస్తును మూడు నెలల్లోగా పరిశీలించాలని, 2009 కంటే ముందు నియమితులైన ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ఆధారంగా నిర్ధారణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని విద్యుత్తు సంస్థలను హైకోర్టు ఇటీవల ఆదేశించినట్టు జేఏసీ నేతలు వివరించారు.