హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్, ఆజ్‌తక్ నేషనల్ చానల్ కెమెరామ్యాన్ హఠాన్మరణం చెందారు. గురువారం హైదరాబాద్‌లోని జీడిమెట్ల హమాలీ అడ్డా వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన దామోదర్.. కాసేపట్లో కేటీఆర్ అక్కడికి చేరుకుంటారనే సమయానికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. తోటి మీడియా మిత్రులు సపర్యలు చేసి నీళ్లు తాగించడంతో తేరుకున్నాడు. తిరిగి కొద్దిసేపటి తర్వాత ప్రోగ్రాం కవరేజీకి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
దామోదర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజుకు కేటీఆర్ సూచించారు. వారు హుటాహుటిన దవాఖానకు వెళ్లారు. దవాఖాన యాజమాన్యంతో సమన్వయం చేశారు. దామోదర్ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దామోదర్ మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. దామోదర్ మరణవార్త విని ఆయన భార్యాపిల్లలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా కనిపించిన దామోదర్‌ను చూసి భోరున విలపించారు. దామోదర్ మరణవార్తతో జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

వీడియో జర్నలిస్ట్ దామోదర్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి దామోదర్ తనకు మంచి మీడియా మిత్రుడని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు గురువారం సంతాప ప్రకటన విడుదల చేశారు. దామోదర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. దామోదర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
దామోదర్ హఠాన్మరణంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ ఆత్మకు శాంతి చూకూరాలని, ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు. దామోదర్ మృతిపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, జర్నలిస్ట్‌లు సంతాపం ప్రకటించారు.
ఆజ్‌తక్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు గురువారం మీడియాకు సందేశం విడుదల చేశారు. ఉద్యమ వార్తల కవరేజీలో దామోదర్ ముందువరుసలో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. దామోదర్ అకాల మరణం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.