హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. డీసీసీలకు పూర్వవైభవం తీసుకొనిరావడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నదని, మంత్రి పదవి కోసం పోటీపడిన సీనియర్ నేతలకు ప్రాముఖ్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నదని సమాచారం. అటువంటి వారికి డీసీసీ బాధ్యతలను అప్పగిస్తే.. ఆ పదవికి విలువ పెరుగుతుందని, స్థానిక అవసరాలకు నిధుల సమస్య భారం కూడా కొంతమేరకు తగ్గుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లాల్లో సీనియర్లుగా ఉండి, మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆసక్తిపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా కమిటీలు ఉన్నాయి. ఇందులో 14 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. మిగిలిన జిల్లాల డీసీసీలు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వారందరూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమితులైనవారేనని, ఇప్పటికే వివిధ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వీరు పార్టీ కార్యక్రమాలకు సమయం ఇవ్వలేక పోతున్నారని పీసీసీకి ఫిర్యాదులొస్తున్నాయి. అటువంటి డీసీసీలను ప్రక్షాళన చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలిసింది. డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే దానిపై ఇటీవల ఏఐసీసీలో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ ఎమ్మెల్యేను జిల్లా కాంగ్రెస్ పీఠం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం.
స్థానిక సంస్థలు, చట్టసభలకు పోటీ చేసే వారిని డీసీసీ స్థాయిలోనే ఖరారు చేయాలని, వారు పంపించే పేర్లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిలో నుంచే అభ్యర్థులను ఖరారు చేయాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఢిల్లీ స్థాయిలోనే ఈ నెల మూడో వారం లోపు ఏఐసీసీ పరిశీలకులను నిర్ణయించి, క్షేత్రస్థాయికి పంపించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా సిఫారసు చేస్తూ.. పీసీసీ సూచించిన ముగ్గురు అభ్యర్థుల పేర్లపై వీరు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అభిప్రాయాలు సేకరించి, అంతిమంగా ఒకరి పేరును అధిష్ఠానం ముందుపెడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సీనియర్ ఎమ్మెల్యేలకు డీసీసీ మీద ఆసక్తి ఉంటే ఎటువంటి స్క్రీనింగ్ లేకుండానే నేరుగా పేరు ప్రపోజ్ చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.