CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రులుగా అపార అనుభవం కలిగిన తమను ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేని సీఎం రేవంత్‌రెడ్డి శాసించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడటం అనేది గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ లేదని మండిపడుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోని తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ తదితరులు గతంలో రెం డు, మూడు పర్యాయాలు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్నవారే. వీరిలో దామోదర రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
ఇక తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. మిగిలినవారికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన అపార అనుభవం ఉంది. గతంలో ఏ సీఎం కూడా తమను ఈ రకంగా కట్టడి చేసిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులను తాము ఎదుర్కొనలేదని అంటున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత, అనుభవరాహిత్యానికి నిదర్శనమని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది మంత్రిమండలి నిర్ణయంగానే చూస్తారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలలో సీఎంకు ఎంతటి బాధ్యత ఉంటుందో మంత్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించే అధికారం ఇద్దరు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మాత్రమే కల్పించడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. జనం దృష్టిలో తమను డమ్మీలుగా చేసి అవమానించడం కాదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు ఇద్దరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న అనుభవం ఏమిటి? మొదటిసారి మంత్రి అయిన ఆయనకు తమపై పెత్త నం అప్పగించడం ఏమిటని సీనియర్ మంత్రులు వాపోతున్నారు. మూప్పై, నలభై ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన తాము వెళ్లి ఇద్దరు మంత్రులకు తెలియజేయాల్సిన దుస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం అనాలోచిత, తమపై కర్ర పెత్తనం చేసే ఆధిపత్య నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని సీనియర్ మంత్రి ఒకరు మండిపడ్డారు. పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టు ఉంది తమ పరిస్థితి అని మరో సీనియర్ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తప్ప మంత్రులంతా డమ్మీలేనన్న సంకేతాలు ప్రజలకు ఇచ్చినట్టు అయిందని మండిపడుతున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రెండు రకాలుగా చూస్తున్నామని ఒక మంత్రి విశ్లేషించారు. తన సహచర మంత్రులపై సీఎంకు ఏమాత్రం నమ్మకం లేకపోవడం, వారి అనుభవాన్ని గౌరవించకపోవడం ఒకటైతే.. రెండోది ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మీలన్న అభిప్రాయం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం ఆ పార్టీ నేతలకున్న ప్రత్యేకత. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటననే ఆ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా తప్పుపట్టిన ఉదంతాన్ని ఈ సందర్భంగా సీనియర్ మంత్రి ఒకరు గుర్తుచేశారు. పార్టీ పెద్దలంతా జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జన ఖర్గేను బరిలోకి దింపితే, ఆయనపై శశిథరూర్ పోటికి దిగిన ఉదంతాన్ని ఉటంకించారు. ఈ విధంగా అంతర్గత ప్రజాస్యామ్యం ఉండే కాంగ్రెస్‌లో మంత్రులు ఎవరూ మాట్లాడవద్దనే నిబంధన పార్టీ అధికారంలో ఉన్న మరే రాష్ట్రంలో అయినా ఉందా? అని సీనియర్లు నిలదీస్తున్నారు.
రైతులకు ఒకే దఫా రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని మంత్రిమండలి తీసుకున్న సాహోసోపేత నిర్ణయాన్ని మంత్రుల అందరి సమక్షంలో సమిష్టిగా వెల్లడిద్దామని ప్రెస్‌మీట్‌కు వెంటబెట్టుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. వేదికపై అసలు విషయంకంటే, ‘ఇక నుంచి ప్రభుత్వ నిర్ణయాలను ఎవరంటే వారు కాకుండా ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడిస్తారు’ అని లైవ్‌లో చెప్పడం సీనియర్ మంత్రులను విస్మయానికి గురి చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తున్నప్పుడు వేదికపై ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురైన విషయం పాత్రికేయుల కంట పడకపోలేదు. రైతుల రుణ మాఫీపై మంత్రివర్గ నిర్ణయాన్ని వెల్లడించడానికి సీఎంతో పాటు ప్రెస్‌మీట్‌కు ఉత్సాహంగా వచ్చిన మంత్రులు సీఎం చేసిన వ్యాఖ్యలతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.