ఖైరతాబాద్, మే 27 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతున్నదని, ఇకనైనా అక్కడి నేతలు తమ వైఖరి మార్చుకోవాలని వక్తలు హితవు పలికారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ సంస్కారం ఉన్న వ్యక్తి అని, సినీనటులకు ఆయన విలువేం తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంకా ఆంధ్రా పెత్తనం కొనసాగుతున్నదని, ప్రస్తుతం రాజ్యాంగంలోని నాలుగు అంగాలు వారి చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుత మంత్రివర్గంలోనూ అదే తంతు సాగుతున్నదని, సినీగాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడుతూ, గద్దర్ విగ్రహాన్ని మాత్రం అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మరో ఉద్యమాన్ని నిర్మించాల్సి అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏపీ ప్రభుత్వం అరెస్టులంటున్నదని, అరెస్టు చేస్తారనే భయం తనకు లేనందునే యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేయలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను అసెంబ్లీ మెట్లెక్కాను కానీ ఇంకా జైలు అనుభవం లేదని, ఇలాంటి ఓ కేసుతో అది తీరుతుందని భావిస్తున్నానని చెప్పారు. అయితే అరెస్ట్ చేసేందుకు ఇప్పటివరకు ఎవరూ తన ఇంటికి రాలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వమే నేరుగా తనపై కేసు పెట్టిందని, తానేమీ ఎక్కడా కుల చిచ్చు పెట్టలేదని స్పష్టంచేశారు. అది ప్రస్తావనకే తీసుకురాలేదని చెప్పారు. ఇక్కడ వారి ఇండ్లు, ఆస్తులు పెట్టుకుంటారు కానీ తెలంగాణ వాళ్లు మాత్రం మాట్లాడకూడదంటే ఎలా? అని ప్రశ్నించారు.
వారు పెట్టిన కేసులను చూస్తే హాస్యాస్పదంగా ఉన్నదని, అందులోని అంశాలు చట్ట వ్యతిరేకం కిందికి రావని స్పష్టం చేస్తున్నా తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడానని.. విశాఖ రైల్వే జోన్ ఒడిషాకు తరలిపోయిందని, మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలను కనుగొంటే వేదాంత సంస్థకు కట్టబెడితే.. ఆంధ్రాలోని ఏ పార్టీ కానీ, ప్రజాప్రతినిధి కానీ మాట్లాడలేదని గుర్తుచేశారు. ఒకవేళ అరెస్ట్ చేస్తామంటే సమయం, స్థలం చెబితే తానే అక్కడి వస్తానని చెప్పారు. సమావేశంలో ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి, అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీనియర్ జర్నలిస్టులు కంబాలపల్లి కృష్ణ, భరద్వాజ, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.