జనగామ టౌన్, మే 28 : తెలంగాణలో ప్రజాస్వామ్యానికి బదులుగా దొంగల రాజ్యం(క్లెప్టోక్రసీ) మాత్రమే నడుస్తున్నదని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెత్తనమే నడుస్తున్నదని ఆరోపించారు. కాంట్రాక్టులు, హౌసింగ్ సొసైటీలు, క్లబ్‌ల్లో కూడా ఆంధ్రావాళ్లే ఉంటున్నారని, తెలంగాణ సీఎంవోలోనూ ఆంధ్రా అధికారుల ఆధిపత్యమే కొనసాగుతున్నదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన సరిగా లేదని మండిపడ్డారు. ప్రజలు మేల్కొని మళ్లీ ఉద్యమాలు చేయాలని, ప్రజల రాజ్యం తెచ్చుకోవాలని చెప్పారు.
గురువారం జనగామ జిల్లాకేంద్రంలో కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ కన్వీనర్, హైకోర్ట్ అడ్వకేట్ సాదిక్ అలీని ఆయన కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క రాజకీయ తెలంగాణ తప్ప ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, మనందరం ఆశించిన తెలంగాణ అసలే రాలేదని ఆవేదన వెళ్లగక్కారు. 80శాతం గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణలో పారుతున్నా సీమాంధ్ర పాలకుల దోపిడీ వల్ల రాష్ర్టానికి నీళ్లు లేకుండా పోతున్నాయని విరుచుకుపడ్డారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్‌కు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందని, మద్దతుగా ఉన్నందుకు కొందరు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేయడానికి గురువారం ఉదయం నుంచి ఆంధ్రా, తెలంగాణ పోలీసులు తమ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండు నెలల క్రితం చంద్రబాబును దేవుడితో పోల్చొద్దని చెప్పిన జర్నలిస్టు కేవీఆర్‌ను ఆంధ్రా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కర్నూల్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను విమర్శిస్తే తెలంగాణ బిడ్డలందరిపై దాడులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘రెండు రెండు నాలుగంటే జైళ్లు నోరు తెరుస్తాయి, గూండాలు గుండ్రాళ్లు విసురుతారా’ని శ్రీశ్రీ చెప్పినట్లు ఇవాళ తెలంగాణలో అదే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరో తెలంగాణ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సాంబరాజు యాదగిరి, బూడిద గోపి, మంగళంపల్లి రాజు, రాగల్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.