మంచిర్యాల టౌన్/హైదరాబాద్ మే 25 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఎండీ మునీర్ (68) శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆదివారం భౌతికకాయాన్ని మంచిర్యాలలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మునీర్ ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్‌గా, టీయూడబ్ల్యూజే 143 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మంచిర్యాల ప్రెస్‌క్లబ్ అ్యక్షుడిగా పనిచేశారు. సింగరేణి జేఏసీ చైర్మన్‌గా కార్మికులను తెలంగాణ ఉద్యమంలో మమేకం చేశారు. మునీర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని మందమర్రికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు ఎమ్మెల్సీ కోదండరాం, టీబీజీకేఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య, సీపీఐ నాయకులు హాజరయ్యారు.
సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ మరణం బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన పాత్రికేయుడిగా కార్మికుల సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆయన ముఖ్యభూమిక పోషించారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి ప్రాంత ప్రజాసంఘాలు, ఉద్యమ శక్తులను ఏకంచేసి ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మునీర్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సింగరేణి, ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక కా ర్మిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని, ఆయన మృతి తీరనిలోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సింగరేణి సకల జనులసమ్మె సందర్భంగా మునీర్ పోషించిన పాత్రను కొనియాడారు. మునీర్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కార్మిక సంఘాల నాయకులు, పాత్రికేయులు సంతాపం ప్రకటించారు.