Allam Narayana : వార్తా పత్రికల కార్యాలయాలపై భౌతిక దాడులకు ప్రయత్నించడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతిసాగర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నమస్తే తెలంగాణ ఎడిషన్ కార్యాలయంపైకి అధికార పార్టీకి చెందిన వందలాది కార్యకర్తలు వెళ్లి దాడికి ప్రయత్నించారని, అడ్డుకున్న సిబ్బందిని దుర్భాషలాడారని, తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
వార్తల విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నప్పుడు న్యాయపరంగా, చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్ప ఈ రకమైన భౌతిక దాడులకు ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది గొడ్డలిపెట్టని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పించిన మీడియా స్వేచ్ఛ హక్కును హరించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించదాన్ని వారు తప్పుపట్టారు.
దాడికి పరోక్షంగా కారకులైన వారితోపాటు ప్రత్యక్షంగా పాల్గొన్న వారు ఎంతటి వారైనా వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన దాడులకు పూనుకుంటే జర్నలిస్టు సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. జర్నలిస్టు సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజలకు వాస్తవాలను వివరిస్తాయని చెప్పారు.
దాడిని ఖండించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హజారే, కోశాధికారి యోగానంద్ , తెంజు రాష్ట్ర అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ రమణ కుమార్ ఉన్నారు