Mulugu | ములుగు : ములుగు జిల్లాలోని మల్లంపల్లి కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
వివరాల్లోకి వెళ్తే.. దిలీప్, వావిలాల దేవన్ అనే ఇద్దరు విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్న సీనియర్లు దాడికి పాల్పడ్డారు. కర్రలతో చితకబాదారు. దీంతో ఫస్టియర్ విద్యార్థులపై దేవన్, దిలీప్ తొడలు, కాళ్లు కమిలిపోయాయి. బాధిత విద్యార్థులిద్దరూ నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న గొడవను మనసులో పెట్టుకొని, ముగ్గురు సీనియర్లు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధిత విద్యార్థులు వాపోయారు.
ఈ ఘటనపై బాధఙత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ సీనియర్ ఇంటర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.