హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): సీపీఐ నల్లగొండ జిల్లా సీనియర్ నేత, స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు మృతిపట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరులో దొడ్డ నారాయణరావు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
నారాయణరావు నిబద్ధతగల కమ్యూనిస్టు నాయకుడని అన్నారు. చిలుకూరు సర్పంచ్‌గా 25 ఏండ్లు పనిచేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అంతిమయాత్రలో పాల్గొన్నారు.