నవాబుపేట, జూలై 3: బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సొంత పార్టీ నేతలే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. యాదయ్య కాంగ్రెస్‌లో చేరడాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మొదలుకొని.. మండలస్థాయి నాయకులు, కార్యకర్తల వరకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సంప్రదింపులతో యాదయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో.. వారిద్దరి పై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమకు తెలియకుండా పార్టీలోకి తీసుకొచ్చేంత పెద్దోళ్లు అయిండ్రా అంటూ మహేందర్‌రెడ్డి బాహటంగానే అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన భీంభరత్ వర్గం.. ఎమ్మెల్యే యాదయ్య నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకుంటున్నది.
దీంతో యాదయ్య ఏమీ చేయలేక తలపట్టుకుంటున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆరు నెలల్లోనే పార్టీ మారడంపై జిల్లా అంతటా ఎమ్మెల్యే యాదయ్యపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం నవాబుపేట మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, ఎస్సీ కమ్యూనిటీహాల్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యఅతిథిగా రావాల్సి ఉంది. అయితే.. యాదయ్య కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న తిమ్మారెడ్డిపల్లి, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు.. ఎస్సీ కమ్యూనిటీహాల్ శంకుస్థాపన, సీసీ రోడ్ల ప్రారంభానికి సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. తిమ్మారెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటనలపై సంబంధిత డీఈ, ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనపై విచారణ చేసి విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు.