హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రచారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆట లు సాగవని హెచ్చరించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైట్ పేపర్లాంటోడని, ఇంక్ చల్లొద్దని మహేశ్వర్‌రెడ్డికి హితవు పలికారు. తప్పులేకున్నా బట్టకాల్చి మీద వేస్తున్నాడని, ఆయనకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అటు రైతులు, ఇటు రైస్ మిల్లర్లు నష్టపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ఐదేండ్లపాటు రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు.