రామాయంపేట, మే 10: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పట్ల వృద్ధులు, వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించాలంటే నకరంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మీటరు నుంచి మొదలుకొని ఎంత దూరం వెళ్లాలన్నా నిలబడే ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. వయస్సు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు నిలబడి ప్రయాణించడంతో పలుమార్లు అస్వస్థతకు గురవుతున్నారు. దూర ప్రయాణాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆర్టీసీ బస్సుల్లో అయితే డబ్బులు మిగలడంతోపాటు సురక్షితంగా ఉంటుందనే భావనే ఉండేది. కానీ నేడు అందుకు బిన్నంగా పరిస్థితి మారింది. టికెట్టు తీసుకొని నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
వికలాంగుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. కొన్ని సందర్భాల్లో వారికి కేటాయించిన సీట్లలో కూడా కూర్చోకుండా ఎన్నో అవస్థలు పడుతూ నిలబడి వెళ్లాల్సి వస్తోంది. అంతే కాకుండా బస్సులో ప్రయాణికులు స్థాయికి మించి ఎక్కడం వల్ల వికలాంగులు, వృద్ధులు ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమైన పనిమీద వెళ్లాల్సి వస్తే స్టేజీల వద్ద బస్సులు కూడా ఆపడం లేదని అంటున్నారు. ఈ ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు ఏమో కానీ తమను మాత్రం తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు కూడా ఈ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. కానీ బహిరంగంగా చెప్పలేకపోతున్నారు.
వికలాంగుల గురించి పట్టింపు లేదు..
ఉచిత బస్సు సరే మరి వికలాంగుల సంగతి ఏంటని ప్రభుత్వం ఆలోచించడం లేదని వికలాంగుల సంఘం మెదక్ జిల్లా ఉపాద్యక్షుడు గంగాపురం సంజీవులు అన్నారు. కాళ్లు, చేతులు లేని వారు, పక్షవాతం వచ్చిన వారు కూర్చొవడానికి కూడా సీట్లు ఉండటం లేదు. మహాలక్ష్మి పథకం నిజంగా ప్రయాణం చేసేవారికంటే కాలక్షేప ప్రయాణాలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. సర్కారు నిర్ణయమే పెద్ద తప్పు. తాము మహిళలకు వ్యతిరేకం కాదు. కానీ మహిళల పేరుతో ఉచిత బస్సు పథకం పెట్టి వృద్ధులు, వికలాంగులకు అన్యాయం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీట్లు దొరకకపోవడంతో నిలబడే ఓపిక లేక బ్రతిమిలాడి సీటు అడగాల్సిన దుస్థితి నెలకొంది.
కనీసం నిలబడి ప్రయాణం చేయలేని పరిస్థితి..
ఎక్కడకైనా బస్సులో వెళ్లాల్సి వస్తే సీట్లు దొరకడం లేదు.బస్సులు కూడా స్టేజీల వద్ద ఆపడం లేదని దామరచెర్వుకు చెందిన కుస్తి సిద్దిరాములు అనే వికలాంగుడు అన్నారు. ఒక వేళ ఆపినా ప్రయాణికులు నిండిపోయి నిలబడి వెళ్లాల్సి వస్తోంది. నాకు ఒక చేయి లేదు. చేయిలేని నాలాగే చాలామంది వికలాంగులు నిలబడి ప్రయాణం చేయడం తోపులాట, ఇరుకు ప్రయాణంతో అవస్థలు పడుతున్నారని చెప్పారు.
ఎవరూ అడగని పథకం..
మహిళలు ఉచిత బస్సు అడగలేదని రామాయంపేటకు చెందిన నాగయ్య అనే వృద్ధడు చెప్పారు. లేని పథకం పెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంలో చాలా మంది మహిళలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వయసు పైబడి కాళ్లు, కీళ్ల నొప్పులతో గంటల తరబడి బస్సులో నిలబడి ప్రయాణం చేయడం నరకంగా ఉంది. బస్సులు లేని గ్రామాలకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలోని ఆడవారితో మారుమూల గ్రామాలకు ఎళ్లాల్సి వస్తే ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తే స్టేజీల వద్ద ఆపడం లేదు. ఈ విషయమై అడిగితే ప్రయాణికులు నిండిపోయారని చెప్తున్నారు. దీంతో ప్రయివేటు వాహనాలు, ఆటోల్లో వెళ్లాల్సి వస్తోంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే విధంగా ఈ ఉచిత బస్సు పథకం ఉందని విమర్శించారు.