హైదరాబాద్,నవంబర్ 8(నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదించారు. స్పీకర్ కాలయాపన చేస్తుంటే రాజ్యాం గ ధర్మాసనాలైన హైకోర్టు, సుప్రీంకోర్టు స్పం దించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నా రు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, రాజ్యాంగంలోని 142వ అధికరణం మేరకు కోర్టులు ఉత్తర్వులు జారీ చేయవచ్చునని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు రెండు అప్పీల్ పిటిషన్లను దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ కొనసాగించింది. గండ్ర మోహన్‌రావు వాదనలు కొనసాగిస్తూ, ఫిరాయింపుల పిటిషన్లను స్పీకర్ హోదాలో విచారణ చేయబోరని, పదో షెడ్యూల్ ప్రకారం ఏర్పడే ట్రిబ్యునల్‌కు చైర్మన్ హోదాలో స్పీకర్ విచారణ చేస్తారని వివరించారు. అధికార పార్టీ తరఫున స్పీకర్ పదవిని చేపట్టిన వ్యక్తి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణకు ఆసక్తి చూపకపోతే, కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ప్రజాతీర్పును కాలరాస్తూ అధికార పార్టీలో చేరిన చట్టసభ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్ధం ఉంటుందని పేర్కొన్నారు.
ఫిరాయింపు జాఢ్యాన్ని ఆదిలోనే తుంచేయాలి
స్పీకర్ తన ముందున్న పిటిషన్లను విచారణ చేపట్టకుండా ఐదేండ్లపాటు కాలయాపన చేసుకుంటూపోతే కోర్టులు చూస్తూ కూర్చోకూడదని, ప్రజాస్వామ్యానికి క్యాన్సన్ వంటి ఫిరాయింపు జాఢ్యాన్ని ఆదిలోనే తుంచివేయాలని హైకోర్టుకు గండ్ర విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు వీలున్నదా? అని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెలువరించిన నాలుగు తీర్పులను ఉదహరించిన గండ్ర, జోక్యం చేసుకోకపోతే ప్రజాతీర్పుకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతుందని చెప్పారు. సదరు అధికరణంలో శూన్యత ఉన్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనాలకు తమకున్న విసృ్తతాధికారాలను వినియోగించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వాదించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒకరోజు కూడా ఆ పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదని చెప్పారు. గతంలో స్పీకర్ తన ముందున్న ఫిరాయింపు పిటిషన్లపై చర్యలు తీసుకోలేదని చెప్పి ఆ విధానాన్ని కొనసాగించి ప్రజలకు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు చెప్పకూడదని పేర్కొన్నా రు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నాలుగు వారాల్లోగా స్పందించాలని, మూడు నెలల్లోగా తగి న నిర్ణయం తీసుకోవాలని, ఇలా జరగనిపక్షం లో హైకోర్టు జోక్యం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. సకాలంలో న్యాయం లభించకపోతే కాలం తీరిన తర్వాత లభించే న్యాయానికి అర్ధం ఉండదని, దీని ప్రకారం ఐదేండ్ల పదవీ కాలం ముగిసే దశలోనో, పదవీకాలం ముగిసిన తర్వాతో స్పందిస్తే లభించేది న్యాయం కాబోదని వివరించారు. స్పీకర్ ఎలాంటి తీర్పునైనా చెప్పవచ్చునని, స్పీకర్ తుది నిర్ణయంపై కోర్టులు సమీక్ష చేసేందుకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందంటూ నిబంధనలను గుర్తుచేశారు. సింగిల్ జడ్జి, స్పీకర్ తన ముందున్న ఫిరాయింపు పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారని, ఫిరాయింపు పిటిషన్లపై తుది నిర్ణయం స్పీకర్ దేనని చెప్పారు. ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఆరు నెలలు అయ్యిందని, ఇప్పటివరకు విచారణ షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయలేదని, ఈ దశలో రాజ్యాంగ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.