హైదరాబాద్/సిటీబ్యూరో సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి డ్రగ్స్ రాకెట్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి డ్రగ్స్‌ను రహస్యంగా విక్రయించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాగ్దేవి ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్, వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సెల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట చర్లపల్లి, నాచారంలో శ్రీనివాస్ విజయ్ పలు కంపెనీలను స్థాపించి, తన సోదరుడు శ్రీనివాస్ అజయ్, రాజన్రెడ్డి రామసాని, దువ్వూరి సుబ్రహ్మణ్యంను డైరెక్టర్లుగా నియమించినట్టు గుర్తించారు.
వాగ్దేవి ల్యాబొరేటరీలో తయారు చేసిన డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో కిలో రూ.50 లక్షల చొప్పున విక్రయించినట్టు తేల్చారు. హైదరాబాద్‌తోపాటు ముంబై, కర్ణాటక, గోవాలోనూ శ్రీనివాస్ విజయ్ భారీగా డ్రగ్స్ విక్రయాలు జరిపినట్టు అనుమానిస్తున్న ముంబై పోలీసులు.. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
దువ్వూరి సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఐడెంటిటీ నంబర్ (డీఐఎన్) 01815164తో సెర్చ్ చేయడంతో దేశవ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వివరాలు వచ్చాయని ముంబై పోలీసులు తెలిపారు. పలు నగరాల్లో ఉన్న ఆ కంపెనీలకు అనుబంధంగా ఒకేరకమైన అడ్రస్‌లు కలిగిన షెల్ కంపెనీలు ఉన్నాయని, వాటికి బదిలీ చేస్తున్నట్టు అనుమానముందనారు.
తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటైన ‘ఈగల్’ టీమ్ 7 నెలల క్రితమే శ్రీనివాస్ విజయ్‌పై దృష్టి పెట్టింది. కానీ, ఆయన తయారు చేస్తున్న డ్రగ్స్ వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా కేవలం నోటీసులిచ్చి సరిపెట్టింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ శ్రీనివాస్ విజయ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసును ఫాలోఅప్ చేయాల్సిన ఈగల్ టీమ్.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో శ్రీనివాస్ విజయ్ డ్రగ్స్ తయారీకి పూనుకున్నట్టు సమాచారం. కాగా, ఏడాది క్రితం ముంబై పోలీసులూ శ్రీనివాస్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నట్టు తెలిసింది.
ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకు, రసాయనాలు, సామగ్రిని ఆదివారం ముంబైకి 200 డ్రమ్ముల్లో తరలించారు. ముంబై పోలీసులు శనివారం తెలంగాణలో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.