సారపాక, అక్టోబర్ 13: సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ కలుపుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను గంజాయి కేసులో ఇరికించారంటూ అంతకుముందు ఆయన సెల్ఫీవీడియో తీసుకున్నాడు. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. 8 నెలల క్రితం వరకు భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ఆ సమయంలో బూర్గంపహాడ్ స్టేషన్లో గంజాయి మాయమైన ఘటనలో సాగర్‌కు సంబంధం ఉందంటూ అప్పటి పోలీసులు కేసు పెట్టడంతో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు సాగర్‌ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో దసరా రోజున శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వగ్రామమైన ఏన్కూరులో కలుపుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తొలుత ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందాడు.
ఇదిలావుండగా తన ఆత్మహత్యకు గల కారణాలను సాగర్ ఓ సెల్ఫీ వీడియోలో వివరించాడు. బూర్గంపహాడ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో అప్పటి అధికారులు.. బూర్గంపహాడ్‌కు చెందిన మరో వ్యక్తి ద్వారా బయటి వ్యక్తులతో గంజాయి అమ్మించేవారని ఆ వీడియోలో సాగర్ పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు తన ఫోన్‌ను వాడుతూ తనను ఆ కేసులో ఇరికించారని, తాను సస్పెండ్ కావడానికి కారకులయ్యారని ఆరోపించాడు. అందువల్లనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఈ సెల్ఫీ వీడియో జిల్లాలో వైరల్ అయింది.
‘రేవంతన్నా.. నా భార్యాపిల్లలను కాపాడండి.. ‘రేవంతన్నా.. నా భార్యాపిల్లలకు, అమ్మానాన్నకు న్యాయం చేయండన్నా. ఈ కేసు విచారణ జరిపించండన్నా’ అంటూ చికిత్స పొందుతూ తీసిన మరో వీడియో కూడా ఆదివారం సాయంత్రం విడుదలైంది.
అప్పటి పోలీస్ అధికారులే బాధ్యులు..
సాగర్ ఆత్మహత్యపై ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు ఏన్కూరు పోలీసుస్టేషన్లో ఆదివారం కేసు నమోదైనట్టు ఎస్సై రఫీ తెలిపారు. సాగర్ బూర్గంపహాడ్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే సమయంలో అధికారులు సంతోశ్, రాజ్‌కుమార్, సత్యనారాయణ సహా మరో వ్యక్తి నాని కలిసి ప్రణాళిక ప్రకారం గంజాయి కేసులో ఇరికించారని అతని తండ్రి కిషన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులంపేరుతోనూ దూషించారని తెలిపారు.
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 13: మహబూబాబాద్ కలెక్టరేట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆదివారం హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. డీఎస్పీ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోపాల్‌రావునగర్ కాలనీలో నివాసముంటున్న హెడ్‌కానిస్టేబుల్ (ఏఆర్) గుడిబోయిన శ్రీనివాస్ (59)కు 1990లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. 2016 మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత నుంచి ఎస్పీ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. 2018లో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. అనంతరం కలెక్టరేట్లో ఉన్న వీఈఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు డ్యూటీ చేస్తున్నాడు. ఇతని భార్య పదేళ్లుగా విడిపోయి ఉంటున్నది. ఇతడు తల్లితోనే ఉంటుండగా, భార్యతో తరచూ తగాదాలతో మనస్తాపం చెంది తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్‌తో కాల్చుకుని మృతి చెందాడు. ఇతడికి కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ సందర్శించారు. మృతదే హాన్ని ఏరియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.