హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీస్ కొలువుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియ ఐదారు రోజుల్లో పూర్తికానున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లో కలిపి మొత్తం 17,516 పోస్టులకు 12,91,006 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎస్సై, తత్సమాన పోస్టులకు 2,47,630 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్కు ఆరున్నర లక్షల మంది పోటీలో ఉన్నారు. 2018 రిక్రూట్మెంట్లో ఎస్సైకి 1.80 లక్షల మంది ప్రాథమిక రాత పరీక్ష రాశారు. గతంలో పోలిస్తే ఈ సారి ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 70 వేల మంది అభ్యర్థులు పెరిగారు. గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు 4.8 లక్షల మంది పోటీపడగా.. ఈ సారి 1.70 లక్షల మంది అదనంగా చేరారు. అభ్యర్థుల సంఖ్య పెరుగడంతో అదనంగా పరీక్ష కేంద్రాలు ఎక్కడడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై బోర్డు అధికారులు దృష్టి పెట్టారు.
ఆగస్టు 7న నిర్వహించాలనుకుంటున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పాత జిల్లాకేంద్రాలతోపాటు కొత్త జిల్లాల కేంద్రాల్లో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల కోసం ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా వాటిని పరిశీలిస్తున్నారు. మహిళా కళాశాలలు ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మహిళా అభ్యర్థులకు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ మొత్తం కసరత్తుకు మరో ఐదు నుంచి ఆరు రోజులు పట్టొచ్చని, వచ్చేవారం చివరి వరకు పరీక్ష కేంద్రాలపై స్పష్టత వస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గద్వాల, ములుగు వంటి జిల్లా కొత్త జిల్లాల కేంద్రాల్లో గతంలో కేంద్రాలు ఏర్పాటు చేయనందున అలాంటి చోట్ల తగిన కళాశాలలు ఉన్నాయా? లేవా అని ఆరా తీస్తున్నారు. 2018 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు సహా 40 పట్టణాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు అభ్యర్థుల సంఖ్య పెరిగినందున జిల్లా కేంద్రాలతోపాటు పట్టణాల్లోనూ పెద్ద కళాశాలలు, జూనియర్ కళాశాలలను పరీక్ష నిర్వహణకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
