బీబీనగర్, మార్చి 23 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు శనివారం 6,925 కిలోల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాజేశ్చంద్ర వివరాల ప్రకారం.. గూడూరు టోల్‌గేటు వద్ద ఎస్సై ఎన్ రమేశ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న డీసీఎంలో పేలుడు పదార్థాలు గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మొల్గర గ్రామానికి చెందిన బయ్యపు హనుమంతరెడ్డి శ్రీసాయి హనుమాన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పేలుడు పదార్థాల వ్యాపారం చేస్తున్నాడు.
హనుమంతరెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్‌కు చెందిన పెదవీడు నర్సింహులు తన యజమాని ఆదేశాల మేరకు కొండాపూర్‌లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ నుంచి 6,925 కిలోల పేలుడు పదార్థాలను డీసీఎంలో రవాణా చేస్తున్నాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రీసాయి హనుమాన్ ఎంటర్ప్రైజెస్ యజమాని బయ్యపు హనుమంతరెడ్డి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ యజమాని దేవేందర్‌రెడ్డి, మేనేజర్ దత్తురావు, అకౌంటెంట్ పరశురాములు, డీసీఎం డ్రైవర్ నర్సింహులును అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ పేర్కొన్నారు.