హైదరాబాద్: ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద, జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున టాస్క్‌ఫోర్స్ పోలీసులు మోహరించారు. ఇంటిదారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లీగల్ టీమ్‌తో బన్నీ చర్చించనట్లు తెలిసింది. విచారణకు వెళ్లాలా లేదా సమయం కోరాలా అనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
అల్లు అర్జున్ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేశ్ కుమార్‌తోపాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీడియో ఆధారంగా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తావించిన అంశాలపైనా ప్రశ్నించే అవకాశం ఉంది.