కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 29 : భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ నేతలు భారీ ఎత్తున ఆయుధాలను వదిలి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కోహకమేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో భద్రతా బలగాలు ఐదు రోజులుగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మావోయిస్టులపైకి ఎదురు కాల్పులకు దిగారు.
వర్షంలోనే కొన్ని గంటలపాటు సాగిన భీకర పోరులో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు తమ ఆయుధాలు, సామగ్రిని వదిలి పారిపోయినట్లు ఐజీ తెలిపారు. అనంతరం ఘటనా స్థలం నుంచి లైట్ మిషన్ గన్(ఎల్ఎంజీ)లు, ఏకే-47లు, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, స్టెన్‌గన్ వంటి అధునాతన ఆయుధాలు, బ్యారల్ గ్రనెడ్ లాంచర్లు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.