Vande Bharat | సికింద్రాబాద్ – నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ స్టేషన్‌కు చేరుకొని.. 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఇకపై రైలు 5.43గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని చెప్పింది. ఈ మార్పు అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా స్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులులేవని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ప్రయాణికులు మార్పును గమనించాలని కోరింది. నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. నాగ్‌పూర్ -సికింద్రాబాద్ (20101) వందే భారత్ ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్ బయలుదేరి.. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇక సికింద్రాబాద్-నాగ్‌పూర్ (20102) రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది. సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.