BJP | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాజధాని హైదరాబాద్‌లో బీజేపీకి షాక్ తగిలింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం తాడ్బండ్లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం కేశవరెడ్డి.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేశవరెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు.
బీజేపీలో భవిష్యత్తు లేదని, కంటోన్మెంట్‌కు చెందిన ఓ శాడిస్ట్ నాయకుడి వల్లే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. బీజేపీలో ఏ కార్యక్రమంలోనూ తాను స్వయంగా పాల్గొనలేదని, అనుచరవర్గం సైతం కమలం పార్టీలో ఇమడలేకపోతున్నదని చెప్పారు. అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పినట్టు స్పష్టంచేశారు. కంటోన్మెంట్ బోర్డుకు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నదని తెలిపారు. సర్వీస్ చార్జీల కింద బోర్డుకు కేంద్రం ఇవ్వాల్సిన సుమారు రూ.750 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మరికొంతమంది ముఖ్య నాయకులు బీజేపీని వీడినున్నారని సమాచారం.