హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయం ఉమ్మడి పాలమూరుకు శాపంగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యం నడిగడ్డను నట్టేట ముంచుతున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89తో రాష్ర్టానికి ఒరిగేది శూన్యమంటూ ఆది నుంచీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న వాదనే నిజమని తేలింది. కృష్ణా జలాల పంపిణీపై ఇటీవల విచారించిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ కూడా ఈ విషయన్ని తేల్చి చెప్పారు. ఫలితంగాకృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ఒక్కటే ఇప్పుడు దిక్కైంది.
తొలుత ఆమోదించి.. ఆపై వెనకడుగు
ఏపీ పునర్విభవజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా, గోదావరి జలాలను కేవలం ప్రాజెక్టుల వారీగానే పంపిణీ చేయాలని మాత్రమే అప్పటి యూపీఏ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. అలా చేస్తే తమకు ఒరిగేదీ ఏమీ ఉండదని, పరీవాహాక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలను తేల్చాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టికి కేసీఆర్ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై 14న వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవచ్చని న్యాయశాఖ చెబుతున్నా కేంద్రమాత్రం కాలయాపన చేస్తూ వచ్చింది. ఏడాది వేచి చూసినా ఫలితం లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరుగుతుండగానే న్యాయశాఖ సలహాతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నవంబరు 17, 2015లో ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ మూడు వారాల్లోపే మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోని కేంద్రం చివరికి 6 అక్టోబర్ 2020లో ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించినా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని షరతు పెట్టింది. సరేనన్న ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుని రెండేళ్లు కావస్తున్నా కేంద్రం నుంచి ఇప్పటికీ ఉలుకుపలుకూ లేకుండా పోయింది.
అధికారాల్లేవని తేల్చిచెప్పిన ట్రిబ్యునల్
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ- ఏపీ రాష్ర్టాలకు న్యాయమైన నీటి పంపకాలను చేసే అధికారాలు తమకు లేవని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ ఇటీవల తేల్చిచెప్పడంతో ఇప్పుడు తెలంగాణ తన న్యాయమైన నీటి వాటా పొందేందుకు అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ఒక్కటే దిక్కుగా మారింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమో, లేదంటే ప్రస్తుత ట్రిబ్యునల్‌కే న్యాయమైన నీటి వాటాలను పంపిణీ చేసేందుకు అవసరమైన అధికారాలను ఇవ్వడం ద్వారా మాత్రమే తెలంగాణకు ప్రయోజం కలుగుతుంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం తాత్సారం చేస్తూ తమాషా చూస్తున్నది.
బీజేపీ వచ్చాక పెరిగిన వివక్ష
ఉమ్మడి ఏపీ ఏర్పాటు ఫలితంగానే పాలమూరు తన నీటి హక్కులను కోల్పోయి వలసల జిల్లాగా మారింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టం రూపంలో తెలంగాణకు కాంగ్రెస్ మరో అన్యాయం చేసింది. వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని సెక్షన్ 89ను పొందుపరచింది. ఇప్పుడా నిబంధనే తెలంగాణకు తీరని శాపంగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణపై వివక్ష మరింత పెరిగింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ఏడేండ్లుగా ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతూ వస్తున్నది. అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపి దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.