Allu Arjun | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును జనవరి 3న వెల్లడించనున్నట్టు 2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి వినోద్‌కుమార్ ప్రకటించారు. అంతకుముందు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. ఈ కేసులో అల్లు అర్జున్‌కు బీఎన్ఎస్లోని 105 సెక్షన్ వర్తించదని నివేదించారు.
ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా గాయపర్చి ఆ వ్యక్తి మరణానికి కారణమైనప్పుడే ఈ సెక్షన్‌ను నమోదు చేయాల్సి ఉంటుందని, అల్లు అర్జున్‌కు అలాంటి ఉద్దేశమే లేననప్పుడు రేవతి మరణాన్ని ఆయనకు ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు మూడుసార్లు అల్లు అర్జున్ను ప్రశ్నించారని, విచారణాధికారికి ఆయన పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడని తెలిపారు. అల్లు అర్జున్‌కు హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేస్తూ.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదన అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.