జహీరాబాద్, డిసెంబర్ 14: సంగారెడ్డి జిల్లా బీజేపీలో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. రెండువర్గాల వారు కొట్టుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. బీజేపీ భరోసాయాత్ర నిర్వహించేందుకు ఝరాసంగం మండ లం బర్దీపూర్ గ్రామానికి చెందిన జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డితోపాటు జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు బుధవారం బర్దీపూర్‌కు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన కొద్దిసేపటికే వర్గ విబేధాలు తలెత్తాయి. కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న జంగం గోపి తన వర్గీయులతో కలిసి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డితో గొడవకు దిగాడు. గతంలో అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసి డబ్బులు ఖర్చు చేశానని, ఇప్పుడు తనను కాకుండా మరోవ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఎలా ప్రచారం చేస్తారని గోపి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గోపి వర్గీయులు జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డితోపాటు జహీరాబాద్‌కు చెందిన చింతల్‌ఘాట్ సుధీర్‌కుమార్, మరికొందరిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నరేందర్‌రెడ్డి, సుధీర్కుమార్తోపాటు పలువురికి గాయా లవగా దవాఖానకు తరలించారు.