మలక్‌పేటలోని లాలాజర్ హోటల్ సమీపంలోని న్యూ మలక్‌పేట రోడ్డులో భారీ గుంత ఏర్పడింది. పైపులైన్ మరమ్మతుల కోసం ఇటీవల తవ్వి పూడ్చిన గుంతపై నుంచి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ వెళ్లడంతో ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. గుంతలో పైప్‌లైన్ నుంచి వాటర్ లీకేజీని గుర్తించారు. సమాచారం అందుకున్న డబీర్‌పురా పోలీసులు, మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని గుంతచుట్టూ బారీకేడ్లను ఏర్పాటు చేశారు.
స్థానికులు ఎమ్మెల్యే బలాలకు సమాచారం అందించటంతో పైపులైన్‌కు మరమ్మతు, గుంత పూడ్చివేతకు సంబంధిత అధికారులను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోక ముందే సంబంధిత అధికారులు పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి గుంతను పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.
– మలక్‌పేట, ఫిబ్రవరి 11