NKLIS | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) పనుల టెండర్లపై ఇరిగేషన్ శాఖ ఆది నుంచీ గోప్యతను పాటిస్తున్నది. తాజాగా, సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్)లో ఈ ప్రాజెక్టు పనుల టెండర్లు ఖరారైనట్టు తెలిసింది. కానీ, అందుకు సమాచారాన్ని ఇరిగేషన్ శాఖ, ప్రాజెక్టు అధికారులు వెల్లడించడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో రూ.లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 2 ప్యాకేజీలుగా ఎన్కేఎల్ఐఎస్ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి ప్యాకేజీలో పంచ్దేవ్పహాడ్, భూత్పూర్ పంపింగ్ స్టేషన్లతోపాటు పలు చెరువుల అభివృద్ధి చేపట్టనున్నారు. అందుకు రూ.1,134.62 కోట్లు అవుతాయని అంచనా వేశారు. రెండవ ప్యాకేజీలో రూ.1,126.23 కోట్ల అంచనా వ్యయంతో ఊట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే రూ.2,260.85 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇటీవల ఈ 2 ప్యాకేజీల పనులకు ఇరిగేషన్ శాఖ టెండర్లను ఆహ్వానించడంతో మొదటి ప్యాకేజ్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రక్తసంబంధీకులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ, 2వ ప్యాకేజీ పనులను మేఘా కంపెనీ దక్కించుకున్నాయి.
అంచనా వ్యయం కంటే అధిక మొత్తానికి ఆమోదం
సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా ఎస్ఈ టెండర్లను ఆహ్వానిస్తారు. టెక్నికల్ బిడ్లను సదరు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఆమోదించాక ఫైనాన్షియల్ బిడ్ల కోసం అనుమతిస్తారు. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం అందులో అన్ని అర్హతలు ఉన్న కంపెనీకి టెండర్లను ఖరారు చేస్తారు. ఆపై టెండర్లకు ఆమోదం తెలిపేందుకు సీవోటీకి పంపిస్తారు. తాజాగా ఎన్కేఎల్ఐఎస్కు సంబంధించిన 2 ప్యాకేజీల టెండర్లు కూడా సీవోటీ ముందుకు రావడంతో వాటిపై ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. తుదకు ఆ 2 టెండర్లలో ఎలాంటి మార్పులు చేయకుండా అంచనా వ్యయం కంటే 3.95% అధిక మొత్తానికి ఆమోదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ, అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రాజెక్టు అధికారులు గానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు గానీ వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే లోపాయికారిగా జరిగిన ఒప్పందాల మేరకే ఎన్‌కేఎల్‌ఐఎస్ టెండర్లను ఆ 2 కంపెనీలకు కట్టబెట్టారని, అందుకే గోప్యత పాటిస్తున్నారని ఇరిగేషన్ శాఖలో అధికారులు చర్చించుకుంటున్నారు.