హైదరాబాద్/వనస్థలిపురం, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఫస్టియర్, సెకండియర్ రెండు పరీక్షల హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. సీఈసీ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థి ఫస్టియర్‌లో ఐదు సబ్జెక్టులు, సెకండియర్‌లో ఐదు సబ్జెక్టుల చొప్పున మొత్తం 10 సబ్జెక్టులకు హాల్‌టికెట్ జారీ అయ్యింది. ప్రస్తుతం ఫస్టియర్‌లో ఉండి, సెకండియరే చదవని ఆయా విద్యార్థి ఇప్పుడు సెకండియర్ పరీక్షలు రాయడమా.. లేదా ? అన్నది ఆయా విద్యార్థికి ప్రశ్నార్థకంగా మారింది.
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన విద్యార్థి ఏర్పుల వంశీ వికాస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. వంశీకి సెకండియర్‌కు సైతం హాల్‌టికెట్ జారీకావడంతో కాలేజీ నిర్వాహకులను సంప్రదించాడు. వారు రెండు పరీక్షలు రాయమని చెబుతుండటం, తనకు అంత వయస్సు లేకపోవడం భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయన్న ఆందోళనలో సదరు విద్యార్థి ఉన్నాడు.
కాలేజీ తప్పిదమా.. లేక ఇంటర్‌బోర్డు తప్పిదమో తెలియదు కానీ సెకండియర్‌కు ఎలా పరీక్షలు రాయాలి అన్న సందిగ్ధతలో విద్యార్థి ఉన్నాడు. సిద్దిపేట జిల్లాలో సమీపంలోని కాలేజీలను కాదని, 48 కిలోమీటర్ల దూరంలో సెంటర్ వేసిన ఘటన మరువకముంటే తాజాగా హాల్‌టికెట్ ఘటన వెలుగుచూసింది.