హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సాధారణంగా సెలవు రోజుల్లో బోర్డు పరీక్షలు పెట్టరు. కానీ, తాజాగా విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో రెండో శనివారం పరీక్ష పెట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తున్నది. సెలవురోజు పరీక్ష పెట్టడమేంటి? అని ఉపాధ్యాయ సంఘాలూ ప్రశ్నిస్తున్నాయి. వార్షిక పరీక్షల షెడ్యూల్ అశాస్త్రీయంగా ఉన్నదని మండిపడుతున్నాయి. విద్యార్థి సంఘాలు సైతం అసంబద్ధంగా ఉన్న షెడ్యూల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలను 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు ప్రారంభమయ్యే మార్చి 14 రెండో శనివారం. సెలవు రోజు పరీక్ష పెట్టడంపై టీచర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని టీచర్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్చేస్తున్నాయి. బుధవారం ఎస్టీయూటీఎస్, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్‌ను కలిసి వినతి అందజేశారు.
అభ్యంతరాలివే..
తొందరపాటు నిర్ణయం: ఎస్టీయూ
నెల రోజులకు పైగా పరీక్షలు నిర్వహించడం అసంబద్ధం. ఇది తొందరపాటు నిర్ణయం. ఇది విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నదని ఎస్టీయూ పేర్కొన్నది. అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
అశాస్త్రీయంగా పరీక్షల షెడ్యూల్
ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ అశాస్త్రీయంగా ఉన్నది. ఏడు పేపర్లు రాయడానికి 35 రోజుల సమయం అనాలోచిత నిర్ణయం. ఈ టైమ్‌టేబుల్‌తో లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా ఉన్నది. 6-9 తరగతుల విద్యార్థులపై టీచర్లు దృష్టిపెట్టలేరు.
– చావ రవి(టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు)
విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది
ఒక్కో పరీక్షకు నాలుగు, ఐదు రోజుల వ్యవధి ఇవ్వడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్‌తో పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయగలరు. తక్షణమే షెడ్యూల్‌ను సవరించాలి.
– నాగరాజు(ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)