DOST | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 3,71,096 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 60,436 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే 3,10,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్‌లో కేవలం 16% సీట్లు మాత్రమే భర్తీకాగా, 84% సీట్లు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయించారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియా సమావేశంలో దోస్త్ సీట్ల కేటాయింపు సమాచారాన్ని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈసారి 65,191 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, తొలి విడుత 60,436 మంది సీట్లు పొందగా, 4,755 మంది పొందలేకపోయారు. సీట్లు పొందిన వారిలో అత్యధికులు అమ్మాయిలే ఉన్నారు. 38,041 మంది అమ్మాయిలు సీట్లు దక్కించుకోగా, 22,395 మంది అబ్బాయిలు సీట్లు కైవసం చేసుకున్నారు.
ఈ సారి కూడా బీకాం కోర్సుదే హవా సాగింది. ఈ కోర్సులోనే అత్యధికులు చేరారు. 21 వేల మందికి పైగా సీట్లు పొందారు. ఆ తర్వాత వరుసగా బీఎస్సీ భౌతికశాస్త్రంలో 15 వేలు, బీఎస్సీ జీవశాస్త్రం కోర్సులో 11వేల మంది చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆర్ట్స్ కోర్సుల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి చూపించలేదు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనిపక్షంలో సీటు కోల్పోతారు. దోస్త్ రెండో విడుత రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 13న రెండో విడుత సీట్లను కేటాయిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కళాశాల విద్య ఆర్జేడీలు రాజేంద్రసింగ్, బాలభాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంగ్లిష్ మీడియంలోనే అత్యధిక మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 60,436 మందిలో 58,575 మంది ఇంగ్లిష్ మీడియం వారే. తెలుగు మీడియంలో 1,552 మంది, ఉర్దూ మీడియంలో కేవలం 309 మంది చొప్పున ప్రవేశాలు పొందారు. హిందీ మీడియంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. గురుకులాలు మినహా మొత్తంగా 805 కాలేజీలు ఉండగా, ఈసారి 74 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక్కరు చేరకపోగా, మిగతా 73 ప్రైవేట్ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. గత మూడేండ్ల కాలంలో 15 మంది లోపు విద్యార్థులు చేరిన ప్రైవేట్ కాలేజీలను బ్లాక్ చేశారు. ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించలేదు. సీట్లు పొందిన వారిలో 42,014 మంది మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు పొందగా, 18,422 మంది రెండో ప్రాధాన్యంగా ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు పొందారు.
ఇంటర్మీడియట్లో సాధించిన మార్కుల ఆధారంగా దోస్త్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థుల ర్యాంకులను కేటాయించారు. ఈ ర్యాంకు, విద్యార్థులిచ్చిన ఆప్షన్లను బట్టి తొలి విడుత సీట్లు కేటాయించారు. అన్నిరకాల కోర్సుల్లో టాప్-5 ర్యాంకర్లల్లో దాదాపు అమ్మాయిలే ఉన్నారు. ఒక్క కామర్స్ -మేనేజ్మెంట్ టాపర్‌గా అబ్బాయి నిలిచారు. పెన్మత్స తేజస్వి ఫిజికల్ సైన్స్ టాపర్‌గా నిలువగా, ఆకునూరి మీనాక్షి లైఫ్‌సైన్స్, పీ వసంత్‌కుమార్ కామర్స్-మేనేజ్మెంట్, ఎం అంకిత ఆర్ట్స్ విభాగం టాపర్లుగా నిలిచారు. ఈ నాలుగు కోర్సుల్లో ఒక్కో కోర్సులో టాప్-5 టాపర్ల వివరాలను పరిశీలిస్తే ఒక్క వసంత్‌కుమార్ మినహా మిగతా 19 మంది అమ్మాయిలే ఉండటం గమనార్హం. మొత్తం 20 మందిలో 8 మంది వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీలోనే ప్రవేశాలు పొందారు.
డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన వారిలో అత్యధికులు ఈసారి ప్రభుత్వ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందారు. అత్యధికంగా సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. ఈసారి నిజాం కాలేజీలో 93.74% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కాలేజీలోనే అత్యధికంగా సీట్లు నిండాయి. ఈ కాలేజీలో ఖాళీ సీట్ల సంఖ్య 23 మాత్రమే. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో 93.19%, సిటీ కాలేజీ (హైదరాబాద్)లో 88.89, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలో 82.69, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 80.98, బాబూ జగ్జీవన్రాంకాలేజీ (నారాయణగూడ)లో 80.29, ఎస్ఆర్ఆర్ కాలేజీలో (కరీంనగర్) 73.01, ఇందిరాప్రియదర్శిని (నాంపల్లి)లో 68.56, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (సుబేదారి) 66.01, గిరిరాజ్ కాలేజీ (నిజామాబాద్)లో 65.75% చొప్పున సీట్లు నిండాయి.