జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం/మహదేవపూర్, జనవరి 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌లో కుంగిన పిల్లర్ వద్ద నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైనాసార్, వాట్సన్ ఏజెన్సీలతో టెస్టింగ్ పనులు కొనసాగిస్తూనే ఉంది. టెస్టింగ్ పనులు పూర్తి కాగానే పిల్లర్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక అన్నారం(సరస్వతి)లో 38, 28 ఔట్లెట్స్ వద్ద ఏర్పడిన సీపేజ్‌లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ గ్రౌటింగ్ పనులను కొనసాగిస్తున్నది. 25 మంది నిఫుణులతో మొదటి విడత గ్రౌటింగ్ పనులు పూర్తి చేసింది. రేపటి (ఆదివారం) నుంచి రెండో విడత గ్రౌటింగ్ పనులు ప్రారంభించనున్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. అందుకు అవసరమైన కెమికల్ శనివారం అన్నారం చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 13న అన్నారం బరాజ్‌లోని 38, 28 ఔట్‌లెట్స్‌లో గల రెండు సీపేజ్‌లకు మొదటి విడత గ్రౌటింగ్ పనులు మూడు రోజుల్లో పూర్తి చేశారు. రెండు సీపేజ్‌లకు గ్రౌటింగ్ చేసిన ఆప్కాన్స్ నిపుణులు కొంత గడువు ఇచ్చి పరిశీలన చేస్తున్నారు. రెండు సీపేజ్ల గ్రౌటింగ్‌తో ఇంకా ఏమైనా సీపేజ్‌లు బయటికి వస్తాయా? పరిస్థితి ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఆప్కాన్స్ నిపుణులు ఆలోచిస్తున్నారు. రెండో విడత గ్రౌటింగ్ పనులు ఆదివారం ప్రారంభించి వారం, పది రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బరాజ్‌లపై బ్యాంకర్ల సంతృప్తి
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)లో బ్యాంకర్ల బృందం పర్యటించింది. జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను శుక్రవారం పలు బ్యాంకర్ల ప్రతినిధులు పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. అన్నారం బరాజ్‌లో సీపేజ్‌లకు చేస్తున్న ట్రీట్మెంట్పై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో లోపాలు రిపేరు చేయదగినవేనని తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లు అధికారులకు తెలిపినట్టు సమాచారం.