హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ర్టానికి చెందిన ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగ పరికరాల తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకు సంబంధించి సంస్థ దాఖలు చేసుకున్న ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూలై 24, 2024 నాడు సంస్థ ఐపీవోకి దరఖాస్తు చేసుకున్నది. వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో భాగంగా తాజా షేర్లను జారీ చేయడంతో రూ.250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో 1.84 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా మరో రూ.350 కోట్లు సేకరించాలనుకుంటున్నది. ఇలా సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, రుణాల చెల్లింపుల కోసం వినియోగించనున్నది. దీంతోపాటు మరో ఐదు కంపెనీల ఐపీవోల ప్రతిపాదనకు సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఎన్ఎస్డీఎల్, జింకా లాజిస్టిక్స్ సొల్యుషన్స్, ఎన్ఎస్ఈ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు కూడా ఉన్నాయి.