కవాడిగూడ, జూలై 27: బీసీ గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లు పెంచాలంటూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు.. ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6,000 కోట్లు వెంటనే చెల్లించాలని, 100 బీసీ కళాశాలలకు హాస్టల్లు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కపైసా కూడా ఫీజు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.