BC Hostels | ముషీరాబాద్, జూలై 13 : గ్రేటర్ హైదరాబాద్‌లో సహా జిల్లాల్లోని బీసీ హాస్టళ్లలో సీట్లు లభించక బీసీ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. వెంటనే ప్రభుత్వం 20 శాతం సీట్లను పెంచాలని, కొత్తగా 100 బీసీ హాస్టల్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగా హాస్టళ్లు మంజూరు చేసి బీసి విద్యార్థులను ఆదుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో హాస్టల్ సీట్లు లభించక విద్యార్థులు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో నిద్రపోతున్నారని, అక్కడే స్నానాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ కార్యాలయం నిర్లక్ష్యo మూలంగా విద్యార్థుల జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం లేదని, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. సీట్లు రాక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రస్తుతం కొనసాగుతున్న హాస్టళ్లల్లో 20 శాతం సీట్లు పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.