కురవి, జూలై 24: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఎన్నారై దంపతులు లక్ష రూపాయలతో సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఎన్నారై బండి వంశీధర్‌రెడ్డి, కవిత దంపతులు నిధులు సమకూర్చగా.. సోమవారం వారి కుమార్తె బండి తారారెడ్డి ప్రారంభించారు. జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 1995లో బండి ట్రస్ట్ ద్వారా మొదట పాఠశాలలో స్టేజీని ఏర్పాటు చేశామని, ఆ తర్వాత ఈ స్కూల్‌ను యూపీఎస్ నుంచి 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించామని, బండి ట్రస్ట్ ద్వారా రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి పాఠశాల మైదానానికి కేటాయించామని తెలిపారు. తమ తాత బండి సుదర్శన్‌రెడ్డి-రుక్మిణీ దంపతుల కోరిక మేరకు.. అమెరికాలో ఉంటున్న తన కుమారుడు బండి వంశీధర్‌రెడ్డి, కవిత దంపతుల సహకారంతో లక్ష రూపాయలతో పాఠశాలలో సైన్స్ ప్రయోగశాల, ప్రింటర్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో బండి ట్రస్ట్ ఫౌండర్ బండి సీతారామరెడ్డి, గ్రామ సర్పంచ్ జంగిలి హరిప్రసాద్, బండి అనిల్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, హెచ్ఎంలు లక్ష్మయ్య, ఎల్లయ్య, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. దాత కుటుంబసభ్యులను సర్పంచ్‌తోపాటు పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.