పటాన్చెరు, ఫిబ్రవరి 28: సైన్స్‌లో సరైన పరిశోధనలు జరిగి, సరిగ్గా వినియోగించకుంటే దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, గీతం ఛేంజ్ మేకర్స్ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం అని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిర రంగాల్లో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి యువత కృషిచేయాలని సూచించారు. అనంతరం మల్టీడిసిప్లీనరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్సేషనల్ ఇనిషియేటివ్స్(ఎంయూఆర్టీఐ)ను డాక్టర్ ఎల్లా ప్రారంభించారు. గీతం సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్, గీతం చాన్స్‌లర్ డాక్టర్ వీరందర్సింగ్ చౌహన్ తదితరులు డాక్టర్ కృష్ణ ఎల్లాను సత్కరించారు.