హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. వసతులలేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. కొన్ని స్కూళ్లు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఉచిత పుస్తకాలిచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం విద్యార్థులకు ఒక జత యూనిఫారమే అందనున్నది. సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆందోళన కలిగిస్తున్నది. 3-4 లక్షల మంది తగ్గిపోయారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యాశాఖ ఉంది. గతంలో ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో విద్యాశాఖ మంత్రి మే, జూన్ మాసాల్లో అధికారులతో సమీక్షించడం అనవాయితీ. కానీ ఈ సారి సీఎం రేవంత్ ఒక్కటంటే ఒక్క సమీక్ష నిర్వహించలేదు. పాఠశాల విద్యాశాఖకు పూర్తిస్థాయి రెగ్యులర్ డైరెక్టర్ లేరు. దీంతో అటువైపు దృష్టి పెట్టిన వారులేరు.
సర్కారు బడుల్లో 17వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 26,861 స్కూళ్లు ఉండగా 1,27,543 టీచర్ పోస్టులున్నాయి. వీటిలో 1,11,091 టీచర్లు మాత్రమే ఉన్నారు. 16,969 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుడు 10 వేల టీచర్ పోస్టులు భర్తీచేశారు. అయినా 17వేల టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రాథమిక బడుల్లోనే 9వేలకుపైగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాడల్ స్కూల్లో 2013-14లో రిక్రూట్మెంట్ చేశారు. మళ్లీ టీచర్లను నియమించిన దాఖలాల్లేవు. అవర్లీ బేస్డ్ టీచర్లతో నెట్టుకొస్తున్నారు. టీచర్లున్న చోట విద్యార్థుల్లేరు.. విద్యార్థులున్న చోట టీచర్లు లేరన్న కారణంతో టీచర్ల సర్దుబాటును చేపట్టారు. ఈ సర్దుబాటు జూలై 15తో ముగియనున్నది.
సర్కారు బడులను వసతులలేమీ పట్టిపీడిస్తున్నది. 21వ శతాబ్దంలోనూ ఇంకా తాగేందుకు నీళ్లు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్లు లేని స్కూళ్లున్నాయి. 696 స్కూళ్లకు ఇంకా పక్కాభవనాలే లేవు. అద్దె భవనాల్లో 239 స్కూళ్లు నడుస్తున్నాయి. అద్దె లేకుండా ఇతర భవనాల్లో మరో 264 స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇతర శాఖలకు చెందిన భవనాల్లో 34స్కూళ్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఓపెన్ ప్లేస్లో 159 స్కూళ్లు నడుస్తున్నాయి. 28% స్కూళ్లకు ప్రహరీలు లేవు. 35.92% స్కూళ్లకు ఆట స్థలాల్లేవు. కిచెన్షెడ్లు లేని స్కూళ్లు 42శాతానికి పైగా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చెట్టు కూలిపోయి భవనంపై పడింది. దీంతో గోడలు పగుళ్లు చూపాయి. పిల్లలు బిక్కుబిక్కుమంటూ తరగతి గదులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ పాఠశాల మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ పరిధిలో ఉండటం గమనార్హం.