మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 17: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అధికారిక కార్యక్రమానికి స్కూల్ పిల్లలను వాహనాల్లో కోడిపిల్లల్లా కుక్కి తరలించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రజలు, రైతులు రాకపోవడంతో విద్యార్థులను డీసీఎం వాహనం, ఆటోల్లో తరలించిన తీరు చర్చనీయాంశమైంది. మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రామచంద్రూ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధికారులు మినహా ప్రజలు, రైతులు హాజరుకాలేదు.
ఎక్కువ సంఖ్యలో జనం ఉండాలని భావించిన అధికారులు విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పశువుల్లాగా డీసీఎం వాహనంలో తరలించారు. మీడియా వారు చూసి ఫొటోలు తీసే ప్రయత్నం చేయడంతో డీసీఎం వాహనాన్ని మధ్య లో ఆపి ప్యాసింజర్ ఆటోలు, ట్రాలీ ఆటో ల్లో పరిమితికి మించి కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. డీసీఎం, ఆటో ట్రాలీలో తరలించడాన్ని రోడ్డు వెంట చూసిన పలువురు విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని, వారికి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని చర్చించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పశువుల్లా డీసీఎం వాహనంలో తరలించడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సూర్యప్రకాశ్, కేలోత్ సాయి ఖండించారు.