కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుండెలను హత్తుకునేలా ఉంటున్నాయని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శమని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికి దిక్చూచిగా మారాయని తెలిపారు. నాయకులు అనే వారు దేశం, రాష్ట్రం, గ్రామం దేనికైనా మంచి చేయడానికి ఆలోచించే వారు కావాలని అలాంటి మహోన్నత ఆలోచనలు ఉన్న కేసీఆర్ మంచి పరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారని కితాబునిచ్చారు. కొంతమంది వ్యక్తులు కళ్లు ఉండి చూడలేక, చెవులుండి వినలేక అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలాంటి పథకాలు ఉన్నాయా అంటూ నిలదీశారు.
కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజానికి సేవ చేయడానికి భగవంతుడు వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.