e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home Top Slides హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు మోగిన నగారా

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు మోగిన నగారా

 • గెలుపు విల్లు
 • ప్రతి మనసుకూ చేరిన ప్రచారం.. ముందే ఖరారైన టీఆర్‌ఎస్‌ విజయం
 • అక్టోబర్‌ 30న పోలింగ్‌.. నవంబర్‌ 2న లెక్కింపు
 • కేసీఆర్‌ పరిపాలన, పథకాలకు సర్వత్రా ఆమోదం
 • ఉద్యమ పార్టీకి అండగా హుజూరాబాద్‌ ఓటర్లు
 • అన్ని సర్వేల్లోనూ ఒకే ఫలితం.. గెల్లుదే గెలుపు
 • నియోజకవర్గ చరిత్రలో డిపాజిట్‌ దక్కని బీజేపీ
 • నామినేషన్ల స్వీకరణ మొదలు అక్టోబర్‌ 1
 • నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్‌ 8
 • నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 11
 • ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 13
 • పోలింగ్‌ తేదీ అక్టోబర్‌ 30
 • ఓట్ల లెక్కింపు నవంబర్‌ 2

కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలు ఆగవునామినేషన్‌ దాఖలులో 3 వాహనాలకే అనుమతిరోడ్డు షోలు, మోటర్‌ బైక్‌ ర్యాలీలకు అనుమతి లేదు. ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి.-ఎస్‌ఈసీ శశాంక్‌ గోయల్‌

మీ కాళ్లల్లో కదలాడే బిడ్డగా..
రెండు గుంటలున్న గరీబు బిడ్డను. మీ కండ్ల ముందు తిరిగినోన్ని. కష్టం తెలిసినోన్ని. ఉద్యమంల పనిజేసిన. కేసీఆర్‌ చూపిన బాటలో నడిసిన. పేదోడినైనా నాకు టికెట్టిచ్చిండు. ఆశీర్వదించి ఇక్కడికి పంపిండు. నాకొకసారి అవకాశం ఇచ్చి సూడున్రి. అసెంబ్లీకి పంపండి. మీ నోట్ల నాలుకలా.. మీ కాళ్లల్లో కదలాడే బిడ్డగా ఉంటా.. శక్తివంచన లేకుండా పనిజేత్తా. మీ రుణం తీర్చుకుంటా. -హుజూరాబాద్‌ ఓటర్లకు గెల్లు వినతి

- Advertisement -

కరీంనగర్‌ ప్రతినిధి, సెప్టెంబర్‌ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యమాల గడ్డ హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ముందే ఖరారైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే నిలువాలని నిర్ణయించుకొన్నట్టు తేలిపోయింది. అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అబద్ధాలు, ఆక్రమణలు మరోవైపు! ఆరు దశాబ్దాల కలను సాకారం చేసి, బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌ ఒకవైపు.. దేశప్రజలపై అన్ని రకాలుగా భారం మోపుతున్న బీజేపీ పాలన ఇంకోవైపు! సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం తపన పడే సర్కారు ఒకవైపు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి, ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్న బీజేపీ పరిపాలన ఇంకోవైపు!! ఇలా అన్ని కోణాలు హుజూరాబాద్‌ ప్రజల కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎవరి పక్షాన ఉండాలో.. తమ పక్షాన ఎవరు నిలుస్తారో విస్పష్టమైన అవగాహనకు వచ్చారు. నిర్ణయానికీ వచ్చేశారు.

అక్టోబర్‌ 30 పోలింగ్‌
హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకువెళ్తున్నది. ప్రభుత్వం చేసిన పనులు.. ఇకముందు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ.. గడపగడపకూ తొలి విడుత ప్రచారాన్ని పూర్తిచేసింది. విద్యార్థి నాయకుడు, ఉత్సాహవంతుడు, మచ్చలేని గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను రంగంలోకి దించిన టీఆర్‌ఎస్‌.. ఇంచార్జిగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపడంతో ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ఎవరికీ అందనంత వేగంగా దూసుకెళుతున్నది. ఈటల రాజీనామా చేసినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ చెక్కు చెదరకపోవడమే కాకుండా.. బీజేపీ వెంట అంతో ఇంతో ఉన్న నాయకులంతా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. మరోవైపు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ కూడా ఉద్ధృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలతో ఆయన ప్రచారం హోరెత్తుతున్నది. ఇంకోవైపు మంత్రి హరీశ్‌రావు ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ఈటల ఒంటరిగా బీజేపీలోకి వెళ్లారు. కానీ కాంగ్రెస్‌ నుంచి వందల మందితో పాడి కౌశిక్‌ రెడ్డి, తమ కార్యకర్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌ నిర్వహించిన నియోజకవర్గ స్థాయి గౌడ, రెడ్డి, రజక, విశ్వబ్రాహ్మణ, వెలమ, పద్మశాలి, వైశ్య తదితర సామాజిక వర్గాల ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ సామాజిక వర్గం అంతా ఒక్కతాటిపైకి వచ్చి శ్రీనివాస్‌ విజయానికి కృషి చేస్తున్నది. ఈటల రాజేందర్‌ సొంత గడ్డ కమలాపూర్‌లోనూ టీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. హుజూరాబాద్‌ జమ్మికుంట మున్సిపాలిటీ పట్టణాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగుతున్నది. మున్సిపల్‌ పట్టణాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అన్ని సామాజిక వర్గాలకు భవనాలను కేటాయించారు. అక్టోబర్‌ 3వ తేదీన పెద్దఎత్తున మున్నూరుకాపు సభ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కీలకంగా గంగుల, కొప్పుల
మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే అన్ని కుల సంఘాలు, వృత్తి సంఘాల సమావేశాలు జరిగాయి. అన్ని సంఘాలు గెల్లుకు, టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించాయి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే జరిగే లాభాలు.. బీజేపీకి ఓటు వేస్తే కలిగే నష్టాలు, తల్లిలాంటి పార్టీకి రాజేందర్‌ వెన్నుపోటు పొడిచిన తీరు.. పార్టీలో ఉన్నప్పుడు ఈటలకు కల్పించిన అవకాశాలు.. వాటిని విస్మరించి రాజేందర్‌ స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలతో కలసిన నడిపిన వ్యవహారాలు, పేదల భూముల్లో కబ్జాల వంటి అంశాలను టీఆర్‌ఎస్‌ విడమరిచి చెప్తుండటంతో వాస్తవాలు గ్రహించిన ప్రజలు.. గులాబీకి అండగా నిలువడానికి నిశ్చయించుకున్నారు. పార్టీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి బలమైన వ్యూహాలను అమలు చేసి టీఆర్‌ఎస్‌ గెలుపు ఏకపక్షం అయ్యే విధంగా టీఆర్‌ఎస్‌ ముందుకు దూసుకెళ్తుండగా.. కాంగ్రెస్‌ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నది. కాగా, బీజేపీ క్యాడర్‌లోనూ అనుకున్న జోష్‌ కనిపించడంలేదు.

విశ్వసనీయత వైపు..
రాజకీయాల్లో పదవులు ఉన్నా, లేకున్నా విశ్వసనీయత ప్రజ మద్దతులో గీటురాయిగా ఉంటుంది. ఉద్యమం నడిచినప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌కు ఉన్న విశ్వసనీయతే హుజూరాబాద్‌లోనూ ప్రజల నిర్ణయాన్ని స్పష్టం చేయనున్నది. తెలంగాణ కోసం, ముఖ్యంగా పేదల కోసం ఎంతవరకైనా వెళ్లే నాయకుడిగా కేసీఆర్‌కు ప్రజల్లో పేరు స్థిరపడింది. పదవుల కోసం ఉన్న పార్టీని, సొంత పార్టీ, చేరిన పార్టీనీ ఏమైనా చేయవచ్చనే ధోరణి నాయకుడు ఇప్పుడు ఆత్మగౌరవం అనే మాట చెప్తుండటాన్ని ప్రజలు అంగీకరించడంలేదు. పదవుల కోసం ఏమైనా చేయాలనుకునే నాయకులు అవసరంలేదని, పేదల కోసం పదవులను ఉపయోగించే టీఆర్‌ఎస్‌తోనే తమ ప్రయాణమని అంటున్నారు.

కారుకు ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నరు
పదిహేనేండ్లుగా ఎవరూ చేయలేని పనులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగాయి. అర్హులకు కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇచ్చిన్రు. రైతుల కోసం అనేక పథకాలు అమలవుతున్నయ్‌. 20 ఏండ్లుగా కాని పనులు నేడు చకచకా జరుగుతున్నయ్‌. ఈటల రాజేందర్‌ అభివృద్ధిని పట్టించుకోలేదు. పనుల గురించి అడిగితే దొంగలను చూసినట్టు చూసేటోడు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పుల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నరు. ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉండి కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నరు. -రోటాల భాసర్‌రెడ్డి, రైతు, కనుకులగిద్ద (హుజూరాబాద్‌టౌన్‌)

అన్నదాతలకు అన్నం పెడుతున్న కేసీఆర్‌
నేను 50 ఏండ్ల సంది సూత్తన్న. నాయకులెందరో అచ్చిన్రు. పోయిన్రు. ఎవ్వలన్నా రైతులను పట్టించుకున్నరా..? అదిజేత్తం. ఇది జేత్తం అన్నోళ్లే కానీ, గెలిసినోళ్లు మా మొఖం సూన్నేలేదు. ఓట్ల కోసం వాడుకున్నరు. ఎవ్వల్నో ఒగల్ను గెలిపియ్యాలే కాబట్టి ఓటేసినం. గెలిపిత్తన్నం. కేసీఆర్‌ తన పాణాలను అడ్డంబెట్టిండు. తెలంగాణ తెచ్చిండు. సర్కారు ఏర్పాటు జేసిండు. అప్పటి నుంచి మా బతుకులు మారినయ్‌. రైతు బంధు, రైతు బీమా ఇత్తండు. పెట్టుబడి సాయం టైంకిత్తండు. ఆదుకుంటండు. అన్నదాతలకు అన్నం పెడుతున్నడు. పైసా ఖర్సు లేకుండా పాసు పుస్తకాలు ఇచ్చిండు. ఇంతజేత్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటే ఉంటం. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుచుతం. గెల్లు సీనుకే ఓటేసి గెలిపించుకుంటం.
-సత్యనారాయణరావు, రైతు (కోరపల్లి, జమ్మికుంట మండలం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement