హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘రారా పోదాం.. రారా పోదాం.. స్కూలు పిలుస్తున్నది.. ఆడుకుందాం.. చదువుకుందాం.. దోస్తు రమ్మంటున్నది.’ ఇది పాఠశాల విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమం కోసం రూపొందించిన థీమ్ సాంగ్. ఆకట్టుకునేలా ఉన్న ఈ థీమ్‌సాంగ్‌ను ఇటీవలే విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే లక్ష్యంతో ‘తొలిమెట్టు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, ఈ విద్యాసంవత్సరంలోనూ దీనిని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
భాషలు, గణితం సబ్జెక్టుల్లో కనీన అభ్యసన ఫలితాలను నిర్దేశించి, వాటిని సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఈ కార్యక్రమానికి థీమ్ సాంగ్‌ను రూపొందించి విడుదల చేశారు. సెంట్రల్ స్కేర్ ఫౌండేషన్ ప్రతినిధి నందకిశోర్ ఈ పాటను రాయగా, హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఆలపించారు. ప్రత్యేకించే 1 నుంచి 3వ తరగతి వరకు సాధించాల్సిన అభ్యసన ఫలితాలను కూర్చి ఈ పాటను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలపై చిత్రీకరించిన ఈ థీమ్ సాంగ్‌ను ఎస్సీఈఆర్టీ యూట్యూబ్‌లో విడుదల చేయగా, అందరినీ ఆకట్టుకుంటున్నది.
19 నుంచి జిల్లాస్థాయిలో శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. ఇప్పటికే ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్రస్థాయిలో రీసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాలకు వెళ్లి మంగళవారం జిల్లాస్థాయిలో టీచర్ల శిక్షణకు ప్రణాళిక సమావేశాలు నిర్వహించి, 19 నుంచి 24 వరకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇస్తారు. మొదటి విడతలో ఈ నెల 19 నుంచి 21 వరకు ఉర్దూ, గణితం, రెండో విడతలో 24 నుంచి 26 వరకు ఇంగ్లిష్ టీచర్లకు శిక్షణ ఉంటుంది. ఇక మండలస్థాయిలో ఈ నెల 24 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. మండలాల్లో ఈ నెల 24, 25 తేదీల్లో తెలుగు, 26, 27 తేదీల్లో గణితం, ఈ నెల 31, ఆగస్టు 1 తేదీల్లో ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.