Coal Mines Auction | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 67 కోల్‌బ్లాక్‌ల వేలానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని శ్రావణపల్లి కోల్‌బ్లాక్‌ను సైతం అమ్మకానికి పెట్టింది. ఈ వేలాన్ని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలోనే ఆయన తెలంగాణలోని శ్రావణపల్లి కోల్‌బ్లాక్‌ను వేలానికి పెట్టడం గమనార్హం. మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్లో రిమోట్‌ను నొక్కి వేలానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇదే వేదికపై ఉన్న భట్టి విక్రమార్క బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఆపాలని ప్రస్తావించకపోవడం గమనార్హం.
అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొని బొగ్గుగనులు సాధించాల్సి ఉండెనని చెప్తూ తాము వేలానికి అనుకూలమన్నట్టుగానే వ్యాఖ్యానించారు. ’గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను వేలంపాటలో పాల్గొనకుండా చేసింది. దీని ఫలితంగా సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం బ్లాక్-3లను ఇతర కంపెనీలు పొందాయి’ అంటూ తాము వేలానికి అనుకూలమని తమ వైఖరిని భట్టి బయటపెట్టుకున్నారు. కనీసం బొగ్గు గనుల వేలాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యతిరేకించకపోవడం గమనార్హం. కార్యక్రమంలో బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, ఆ శాఖ కార్యదర్శి అమృత్లాల్ మీనా, అడిషనల్ సెక్రటరీ నాగరాజు, ముఖేశ్మోదీ, సింగరేణి సంస్థ సీఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు. అయితే వేలాన్ని శుక్రవారం ప్రారంభించినా, టెండర్లు ముగిసి, వేలం పూర్తయ్యేందుకు 3 నెలలు పడుతుందని బొగ్గుమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వేలంతో రాష్ర్టాలకే ఆదాయం: కిషన్‌రెడ్డి
బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకే లబ్ధిచేకూరుతుందని బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బొగ్గుబ్లాక్ వేలాన్ని ప్రా రంభించిన అనంతరం ఆయన మాట్లాడు తూ.. వేలం వల్ల రాష్టాలకే ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆదాయం కోసమే తాము బొగ్గు గనుల వేలం వేయడం లేదని, దేశంలో బొగ్గు దిగుమతిని తగ్గించడం, స్వ యం సమృద్ధిని సాధించేందుకే వేలానికి శ్రీకా రం చుట్టామని పేర్కొన్నారు. సుప్రీం మార్గదర్శకాలను అనుసరించే బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నామని, 2020 నుంచి ఇప్పటివరకు 107 కోల్‌బ్లాక్‌లను అత్యంత పారదర్శకంగా వేలం వేశామని తెలిపారు.
గత ప్రభుత్వం వేలంలో పాల్గొనాల్సి ఉండే: భట్టి విక్రమార్క
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొని గనులను సాధించాల్సి ఉండెనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. వేలంలో పాల్గొనకపోవడంతో నాలుగు గనులను సింగరేణి కోల్పోయిందని చెప్పారు. మరోవైపు ఎంఎండీఆర్ యాక్ట్ సెక్షన్ 17(ఏ)1 ప్రకారం రిజర్వేషన్ విధానంలో కేంద్రం కొత్త బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను కిషన్‌రెడ్డి కాపాడాలని, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుంటే తాము అఖిలపక్షంతో సహా వచ్చి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరతామని చెప్పారు. రాష్ట్రంలో గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని సింగరేణి సంస్థకే అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.