హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కనీ సం 15 కొత్త బొగ్గు గనులు ప్రారంభించేందు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. సంస్థ లక్ష్యాలపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఒడిశాలోని నైనీ, జీడీకే, వీకే ఓపెన్ కాస్ట్ గనుల ప్రారంభానికి ఏర్పాట్లుచేయాలని, నైనీ బ్లాక్ నుంచి ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. పెనగడప, రొంపేడు ఓపెన్ కాస్ట్, న్యూపాత్రపాద గనుల ప్రతిపాదనలు, అనుమతులపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది సింగరేణి 68 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని, వచ్చే ఐదేండ్లలో ఏటా 100 మిలియన్ టన్నులకు చేరుకొనేలా కొత్త బ్లాక్‌లకు అనుమతులు సాధించాలని కోరారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, సలహాదారులు డీఎన్ ప్రసాద్, సురేంద్రపాండే, ఈడీ ఆల్విన్, జీఎంలు పాల్గొన్నారు. కాగా, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పుంజుకొంటున్న తరుణంలో లక్ష్యం మేరకు బొగ్గు రవాణా చేయాలని డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, బలరాం అధికారులను ఆదేశించారు.