ధర్మారం, ఫిబ్రవరి 23: దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా ఓ లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న వస్త్ర దుకాణాన్ని గురువారం జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం పొంది స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారు కాంపెల్లి అపర్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 5 వేల విలువైన వస్ర్తాలు కొని అక్కడే నిరుపేదలకు పంపిణీ చేశారు.
మిర్యాలగూడ, ఫిబ్రవరి 23 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 75 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి తోడ్పడుతున్న సీఎం కేసీఆర్ నవ శకానికి మరో అంబేద్కర్ అని కొనియాడారు.