హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీల ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని గుర్తుచేశారు. ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజుశ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని తెలిపారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ధర్మం గెలిచింది: దాసోజు
సుప్రీంకోర్టులో ధర్మం గెలిచిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై తాను రెండేండ్లుగా పోరాటం చేస్తున్నానని, ఇది వ్యక్తులపై పోరాటం కాదని, రాజ్యాంగబద్ధ హకుల కోసం చేసిన పోరాటమని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, ఎవరికి తగినట్టుగా వారు రాజ్యాంగాన్ని అన్వయించుకొని అమలుచేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసుపై సెప్టెంబర్ 17న మరోసారి విచారణ జరగనున్నదని తెలిపారు. గతంలో తన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరసరించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ధర్మం గెలిచినట్టుగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. గతంలో హైకోర్టు తమ నియామక నిర్ణయాన్ని తప్పుబడుతూ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పాత ఆర్డర్‌ను తీసుకొచ్చి.. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఇద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారని వివరించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ పూర్తిగా వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయని చెప్పారు. సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలని అన్నారు. భవిష్యత్తులో ఏ గవర్నర్ కూడా ఇలాంటి తప్పిదాలు చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వబోతున్నదని తెలిపారు. 2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్టు భారత రాజ్యాంగం అందరికీ ఒకేలా వర్తించాలని, కానీ తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
కోదండరాంకు నిరుద్యోగుల ఉసురు తగిలింది: వై సతీశ్‌రెడ్డి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉన్నదని నిరూపించిందని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రజలు, నిరుద్యోగుల గొంతుకనని పదేండ్లు మొత్తుకున్న కోదండరాం.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో పదవి రాగానే అన్నీ మరిచిపోయారని తెలిపారు. నమ్మించి ఓట్లేయించుకొని నిరుద్యోగుల వైపు కన్నెత్తి చూడనందుకే వారి ఉసురు తగిలిందని, అందుకే ఆ పదవి పోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కోదండరాంరెడ్డి తన దుర్బుద్ధిని వీడాలని సూచించారు.
కోదండరాం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి: రాజీవ్‌సాగర్
తన పదవి కోసం నిరుద్యోగులను ముంచిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికైనా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ డిమాండ్ చేశారు. వేలాది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాడుతుంటే, వారి కష్టానికి బదులు కుర్చీల కోసం లాబీయింగ్ చేసిన కోదండరాంను దేవుడే న్యాయస్థానం రూపంలో శిక్షించారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన కోదండరాం ఎమ్మెల్సీగా విమానం ఎకి మాజీ ఎమ్మెల్సీగా విమానం దిగుతున్న చరిత్ర అని ఎద్దేవా చేశారు.