Supreme Court | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కౌంటర్ అఫిడవిట్ సిద్ధమవుతోందని, 22లోగా దాఖలు చేస్తామని రాజు తెలిపారు.
ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 12న సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థల సమాధానం కోరింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.