కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 11 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఈ నెల 8న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆ శాఖకు సరెండర్ చేయడంతో పాటు, సంబంధిత హెచ్‌డబ్ల్యూవో, ఏఎస్డబ్ల్యూవోను కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేశారు. వసతిగృహంలో ఐదుగురు పిల్లలు అస్వస్థతకు గురికాగా, వార్డెన్ ఆర్ఎంపీతో చికిత్స చేయించడం, హాస్టల్‌కు వైద్యుడిని అనుమతించడం, 108లో ప్రభుత్వ దవాఖానకు తరలించాల్సి ఉండగా, ఆటోలో తీసుకెళ్లడంతో సంక్షేమాధికారి రేవా, ఏఎస్‌డబ్ల్యూవో విజయపాల్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఘటనను జిల్లా ఉన్నతాధికారులకు వెంటనే తెలుపని ఎస్సీ డీడీ నాగలైశ్వర్ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు సరెండర్ చేసినట్టు తెలిపారు.